రణం కాదు శరణమే..! ...రోజురోజుకు పడిపోతున్న ఈటల గ్రాఫ్ ..

 రణం కాదు శరణమే..!

...రోజురోజుకు పడిపోతున్న ఈటల గ్రాఫ్ 

ఈటెల రాజేందర్

... మసకబారుతున్న సానుభూతి 

... క్లారిటీ లేని ఈటెల పై నమ్మకం లేని నేతలు 

...భయం లేదంటూనే జంకుతున్న ఈటెల

 ఏ ఆర్ మీడియా/ ఏసియన్ మీడియా 

By...Kondam AshokReddy. Sr. Journalist. Published on  9.5.2021, 11.10 pm

 హైదరాబాద్ : 

రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన ఈటెల రాజేందర్ చేస్తున్నది రణం కాదు, శరణమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పైకి మాత్రం భయపడే బ్లడ్ కాదంటూనే నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురై దాదాపు 10 రోజులు కావస్తుంది. అయినప్పటికీ, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని దానిపై క్లారిటీ రాకపోవడంతో ఆయన అంతర్మథనంలో భయం కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనపై ఉన్న  కాస్త సానుభూతి తగ్గిపోతుంది. "తన బ్లడ్" లో భయం లేదంటూ చెబుతున్నప్పటికీ దానికి అనుగుణంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల  లోలోన భయపడుతున్నట్లు అర్థమవుతుంది. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పడంతో మరింతగా ఆలోచించే సమయాన్ని ఈటల తీసుకున్నట్లుగా చెప్పకనే చెప్పారు. ఇలాంటి సాగదీత తరుణంలో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలోని నేతలు ఆయన పంచన చేరేందుకు  సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకే భవిష్యత్ ఏంటనే విషయం పై క్లారిటీ రాకపోవడం వల్ల ఆయనకు మద్దతు చేద్దామనుకున్న నేతలు కూడా వెనుకంజ వేస్తున్నారు. 10 రోజుల్లో ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా, ప్రభుత్వంపై ముప్పేట దాడి చేయకుండా,  సాగదీత ధోరణి వల్ల ఆయా ఆ పార్టీలో ఉన్న అసంతృప్తి నాయకులు మద్దతు తెలిపేందుకు వెనుకాడుతున్నారు.  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంపై కోవిడ్ పూర్తిగా తగ్గిన తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని ఈటెల రాజేందర్ చెప్పటంతో, ఇప్పట్లో  ఈ అంశం తేలేట్లుగా  కనిపించడం లేదు. కోవిడ్ తర్వాతనైనా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని క్లారిటీ గా ప్రకటించకపోవడం, కేవలం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పటం పై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈటల రాజేందర్ ప్రభుత్వంపై చేసేది రణము కాదు, శరణమే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రణం చేసేవాళ్ళు ఈ విషయాన్ని నాన్చకుండా వెంటనే తేటతెల్లం చేయడం, అందుకు సంబంధించిన రణభేరి మోగించడం జరుగుతుంది. కానీ,  ఇక్కడ  మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.


 ... మంత్రిగా ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా..? 

 రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని అప్పుడు భయపడ్డారా..? అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల వయోపరిమితి పెంచడం ముమ్మాటికీ తప్పేనని, ఇది ఉద్యోగులకు కూడా ఇష్టం లేదని ఈటల రాజేందర్ తాజాగా ప్రకటించారు. అలాగే కోవిడ్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ రెండు అంశాలపై మంత్రిగా ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ తో చర్చించి, వాటిని, అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు...? తీరా పదవి పోయాక ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టడం ఎంత వరకు సమంజసమని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఈటెల రాజేంద్ర నాన్చుడు ధోరణి ని విడనాడి రణమా..? శరణమా..? అనే విషయాల పై ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ముందుకు సాగాల్సి ఉంది. దీనిపైనే ఆయన భవిష్యత్తు రాజకీయం పై ప్రజల నుంచి భిన్న రకాల స్పందన లభించే అవకాశాలు ఉన్నాయి.

Comments

Post a Comment

Popular posts from this blog

విజయవాడ నగరంలో కనక దుర్గ అమ్మవారు రాత్రిపూట సంచరిస్తుందట..!

యండమూరి వీరేంద్రనాథ్ తాజా చిత్రం"అతడు-ఆమె-ప్రియుడు"

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు