ఆంధ్ర ఎంపీ మాదిరిగా ఈటెల అరెస్టు..!
...రాజద్రోహం, భూకబ్జా, వర్గ వైషమ్యాలు పెంచే కుట్ర కేసులు
.. లాక్ డౌన్ పీరియడ్ లోనే అరెస్ట్ రంగం సిద్ధం
... జైలు నుంచి బయటికి రాకుండా నాన్ బెయిలబుల్ కేసులు
ఏఆర్ మీడియా/ ఏసియన్ మీడియా
By .. K. AshokReddy.
Sr. Journalist,
. Published on 15.5.2021, 10.40pm.
హైదరాబాద్:

అచ్చం ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాదిరిగానే ఈటెల రాజేందర్ ను అరెస్టు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ సమయాన్ని అందివచ్చిన అవకాశంగా ఈటలను అరెస్టు చేస్తే గొడవలకు ఆస్కారం ఉండదని భావిస్తోంది. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ తతంగం పూర్తి చేసేందుకు సిద్ధమైంది. కనీసం 6 నెలల వరకు బెయిల్ రాకుండా ఉండే కఠినతరమైన సెక్షన్ లను పెట్టి జైల్లోనే ఉండేవిధంగా పక్కా ప్రణాళికతో వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది, ఇందులో భాగంగా, రాజద్రోహం నేరం తోపాటు భూకబ్జాలు, బెదిరింపులు, హత్యా ప్రయత్నాలు, కుట్ర కోణం వంటి కేసులను పెట్టి జైలుకు పంపేందుకు అంతా సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 124 ఏ, 53ఏ 505 ఏ, 120 బి, వంటి కేసులను పెట్టి శాశ్వతంగా జైల్లో పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు చెలరేగే విధంగా మాట్లాడి కుట్రలు పన్నడం, చివరకు ప్రభుత్వాన్ని అస్థిర పరచడం, ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న పెద్దలను టార్గెట్ చేస్తూ కుట్రపూరితంగా వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత ఆరోపణలు చేయడం వంటివాటిపై ఐపీసీ సెక్షన్ ల ప్రకారం కేసులు నమోదు చేస్తోంది. వీటితో బెయిల్ రాకుండా జైల్లోనే ఉండేటట్లుగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
... పూర్తి సాక్ష్యాల సేకరణ 
ఈటల రాజేందర్ పై నమోదు చేసే కేసుల అన్నిటిపై సాక్ష్యాలు, ఆధారాలను సేకరించి పక్కా ప్రణాళికతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో ఈటల రాజేందర్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ప్రభుత్వాన్ని కూల్చే విచ్ఛిన్న కుట్రలు, భూకబ్జాలు, రైతులపై దాడులు, బెదిరింపులు, హత్యా ప్రయత్నాలు వంటి అన్ని ఆధారాలను వీడియోల రూపంలో కూడా సేకరించినట్లు తెలిసింది. ఇప్పటికే మెదక్ జిల్లా కలెక్టర్ అసైన్డ్ భూముల వ్యవహారంపై ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను అందించినట్లు తెలిసింది. ఈ నివేదికలో ఈటల రాజేందర్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను కబ్జా చేశారని పేర్కొన్నారు. అలాగే అసైన్డ్ భూముల రైతులను బెదిరింపులకు గురి చేసి, బలవంతంగా ఆ భూములను లాక్కున్న ట్లు నివేదికలో పొందుపరిచారు. పైగా రైతులపై ప్రైవేటు సైన్యం తో దాడులు చేశారని, హత్య చేస్తామని భయబ్రాంతులకు గురి చేశారని కూడా కలెక్టర్ నివేదికను ప్రభుత్వానికి అందించిందని సమాచారం. ఇందులో ప్రధానంగా రైతులను బెదిరించడం, దాడులు చేయడం, అక్రమంగా భూములు లాక్కోవటం వంటి కేసులను నమోదు చేయడానికి కఠినతరమైన ఐపిసి సెక్షన్లను పెడుతున్నట్లు తెలిసింది. అలాగే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, ఆ పదవిని దుర్వినియోగం చేసిన కేసును కూడా పెడుతున్నట్లు సమాచారం.
..ఆజ్యం పోస్తున్న ఈటల మాటలు
తాజాగా శనివారం ఈటల రాజేందర్ చేసిన మాటల తూటాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరింత ఆజ్యం పోసినట్లుగా ఉన్నాయి. హుజరాబాద్ లో గొర్రెల మంద పై తోడేళ్ళు పడినట్లు స్థానిక నాయకులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తీవ్ర ఘాటు వ్యాఖ్యల ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. హుజురాబాద్ లో కుట్రలు కుతంత్రాలు జరిపే వారికి ఘోరీ కడతామని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఈటెల పై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం
. సాధ్యమైనంత తొందరగా ఈటల రాజేందర్ అంశాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి సీరియస్ గా హుజూరాబాద్ నియోజకవర్గం లో పావులు కదుపుతున్నారు. ఆ నియోజకవర్గంలో కూడా ఈటెల పై కేసులు నమోదు చేయించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఈటెల రాజేందర్ తాజాగా చేసిన మాటల తూటాల వల్ల ప్రభుత్వం సీరియస్ గా కేసుల పనులను పూర్తి చేయాలని భావిస్తోంది.
దరిద్రుడు ఉద్యమకారులను నిజాం నిరంకుషాపాలన చేస్తూ ఎవరైతే తమకంటే ఎక్కువ అడుగుతారో పదవికి పోటీ అవుతారో అని ప్రాథ్యార్థులుగా సృష్టించుకొని ఉనికిలేకుండా చేడుతున్నాడు చివరకు తగిన మూల్యం చెల్లించుకుంటాడు
ReplyDelete