వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించి సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొందాలి ....... జిల్లా వైద్య ఆరొగ్య శాఖాధికారి డాక్టర్ హరీష్ రాజ్.

 


ఏషియన్ మీడియా నెట్వర్క్
మహబూబాబాద్, జూన్ 19 :

వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జిల్లా వైద్య, ఆరొగ్య శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టిందని జిల్లా వైద్య, ఆరొగ్య శాఖాధికారి డాక్టర్ హరీష్ రాజ్ తెలిపారు.  


శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, వర్షాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులు మలేరియ, డెంగ్యూ, చికెన్ గున్యా, బోధకాలు, మెదడువ్యాపు వ్యాధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టుటకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. 


సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ వి.పి. గౌతం అధ్యక్షతన ఈ నెల 14న జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి  అన్ని శాఖలను సమన్వయపరిచి దిశా నిర్దేశం చేసినట్లు తెలిపారు. 


జిల్లాలోని  ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గ్రామ పంచాయితీల సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎం.పి.టి.సి, ఎం.పి.పి., జెడ్.పి.టి.సి., మున్సిపాలిటీలలోని కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, చైర్మన్ లు అందరూ  ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం కొనసాగించి కార్యాలయ ఆవరణతొ పాటు, పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారని తెలిపారు.


మలేరియా వ్యాధి ఎక్కువగా వచ్చే గ్రామాలలో దోమ తెరలను ఈ నెల 25 లోగా అందిస్తున్నామని, దోమ తెరలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అలా కాకుండా చేపలు పట్టడానికి, మరి ఏ ఇతర కార్యక్రమాలకు ఉపయోగించకుండా పరిశీలించుటకు వైద్య, ఆరొగ్య శాఖ సిబ్బంది, డి.ఆర్డి.ఎ,  ఐకెపి సిబ్బంది సేవలను ఉపయోగిస్తున్నామన్నారు.  

గత మూడు సంవత్సరాలలో మలేరియ 81, డెంగీ 303, అతిసార0 716 కేసులు నమోదయ్యాయని తెలిపారు.  మలేరియ హై రిస్క్ గ్రామాలుగా 9 గ్రామాలను గుర్తించి ఐ.ఆర్.ఎస్. అన్ని గృహాలలో రెండుసార్లు పిచికారి చేయడానికి ప్రణాఌకలు రూపొందించామన్నారు.

ఇంటి ఆవరణలో, పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, నీరు నిల్వ ఉన్నచోట లార్వా దోమలు పెరిగే అవకాశం ఉన్నందున నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.  వర్షపు నీరు నిలిచే ప్రదేశాలలో దోమ లార్వాలను తినే75 వేల గంబుషియా చేప పిల్లలను విడుదల చేయుటకు మత్స్య శాఖ సమన్వయంతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  గంబుషియా చేప పిల్లలను వదిలి దోమ లార్వా ఉత్పత్తిని తగ్గించడానికి ప్రణాఌక చేయడం జరిగిందన్నారు.  గ్రామ పంచాయితీ కార్యాలయాలలో, మున్సిపాలిటిలలో దోమల నియంత్రణకు టియోపాస్ పరిత్రమ్ రసాయనాలు సిద్ధంగా ఉంచామన్నారు.

వర్షాకాలంలో నీటి కాలుష్యంతో సంక్రమించే వ్యాధులు, అతిసారం, టైపాయిడ్, ఇతరత్రా వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వాటిని నివారించుటకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, గ్రామీణ నీటి సరఫరా, మిషన్ భగీరథ సిబ్బంది సహకారంతో త్రాగునీటిలో క్లోరినేషన్ చేయించడమే కాకుండా ప్రజల వద్దకు చేరుకునే వరకు నీటిలో ఉండే అవశేష క్లోరిన్ శాతం 0.5 పి.పి.ఎం. ఉండేలా చూడడం జరుగుతుందని తెలిపారు.  

ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల వలన జిల్లాలో కోవిడ్ సంక్రమణ శాతం తగ్గుతున్న తరుణంలో నిర్లక్ష్యం చేయారాదని,  సీజనల్ వ్యాధులు తోడవకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.  కోవిడ్ తగ్గుతున్న తరుణంలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరగరాదని ప్రభుత్వ ఆదేశాలు పాటించి మాస్క్ ధరించి, చిన్న చిన్న పనులకు చీటికి మాటికి బయట తిరగరాదన్నారు.  ఒకేసారి కుటుంబంలోని వారందరూ కాకుండా ఎవరో ఒకరు బయటకు వచ్చి అన్ని సరుకులు, ఇతర వస్తువులను తీసుకెళ్ళాలని సూచించారు.  కోవిడ్ బారిన పడిన గ్రామంలోని కుటుంబంలోని వ్యక్తి విలేజ్ ఐసోలేషన్ సెంటర్ లో చేరాలని, కుటుంబ సభ్యులతో కలిసి ఉండరాదని సూచించారు.


ఈ సమావేశంలో జిల్లా కోవిడ్ నోడల్ అధికారి రాజెష్, జిల్లా మలేరియా అధికారి సుధీర్ రెడ్డి, డిప్యూటి డి.ఎం. అండ్ హెచ్.ఓ అంబరీష, తదితరులు పాల్గొన్నారు.

          --------------------------

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్