డిజిటల్‌ మాధ్యమాల కోసం ప్రవేశపెట్టిన మూడంచెల నియంత్రణ యంత్రాంగం

 

ఏ రవి కుమార్ స్పెషల్ కరస్పాండెంట్
ఏషియన్ మీడియా నెట్వర్క్
జూన్‌ 25, హైదరాబాద్‌, 2021


డిజిటల్‌ మాధ్యమాల కోసం ప్రవేశపెట్టిన మూడంచెల నియంత్రణ యంత్రాంగం పౌర కేంద్రకమే తప్ప ప్రభుత్వ కేంద్రకమైనది కాదని కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ విక్రమ్‌ సహాయ్‌ స్పష్టం చేశారు.  పత్రికా సమాచార కార్యాలయం, దక్షిణ ప్రాంతీయ కార్యాలయం ఇవాళ నిర్వహించిన వెబినార్‌లో ప్రసంగిస్తూ ఆయన ఈ మేరకు వెల్లడించారు.

సముచిత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటైన నేపథ్యంలో ప్రస్తుత ఫిర్యాదుల సంఖ్య మునుపటితో పోలిస్తే గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. తాజా నిబంధనల ప్రకారం వార్తా పోర్టళ్లు ఇకపై నమోదు చేసుకునే అవసరం లేదని ఆయన ప్రకటించారు. అయితే, ప్రచురణకర్తకు సంబంధించిన ప్రాథమిక సమాచారం తప్పక సమర్పించాల్సి ఉంటుందన్నారు. డిజిటల్‌ మాధ్యమాల తాజా నైతిక నియమావళికి లోబడి వివరాలు సమర్పించే సమయానికి ‘స్వీయ నియంత్రణ ప్రాధికార సంస్థ’ను ఏర్పాటు చేసి ఉండకపోతే సంబంధిత అంశాన్ని దరఖాస్తులో నింపనక్కర్లేదని చెప్పారు. చిన్నచిన్న డిజిటల్‌ ప్రచురణకర్తలంతా సమష్టిగా ఒక సంయుక్త నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసుకునే వీలుందని శ్రీ సహాయ్‌ వివరించారు.

   దేశవ్యాప్తంగా వార్తా ప్రసార, ప్రదానంలో నిమగ్నమైన సుమారు 1500 చిన్న బృందాలు, వ్యక్తులు ఇప్పటికే సమాచార-ప్రసార మంత్రిత్వశాఖకు వివరాలు అందజేశారు. అదేవిధంగా అనేక సంస్థలు, సంఘాలు ‘స్వీయ నియంత్రణ సంస్థ’ ఏర్పాటుపై సమాచారం ఇచ్చాయి. మరోవైపు కొన్ని సమస్యలు, గడువుల సంబంధిత సమస్యలపై అందిన పలు విజ్ఞప్తులను మంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచురణకర్తలందరూ నైతిక నియమావళికి కట్టుబడి నిర్దేశిత స్వరూపంలో వీలైనంత త్వరగా సమాచారం సమర్పించాలని శ్రీ విక్రమ్‌ సహాయ్‌ చెప్పారు. అంతేకాకుండా పరస్పర సంప్రదింపుల ద్వారా స్వీయ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసుకోవడంతోపాటు పరిష్కరించిన ఫిర్యాదుల సంఖ్యను తెలియజేయాలని సూచించారు. ముందస్తు పరిశీలనకు సంబంధించిన ప్రశ్నలకు బదులిస్తూ... సినిమాటోగ్రాఫ్‌ చట్టం-1952 సవరణపై భాగస్వాముల నుంచి ప్రభుత్వం ఇప్పటికే అభిప్రాయాలను ఆహ్వానించిందని వెల్లడించారు.

   కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆన్‌లైన్ మాధ్యమాలు, ఓటీటీ వేదికలు, చలనచిత్ర పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు, పంపిణీదారులు, థియేటర్ యజమానులకు ప్రాతినిధ్యం వహించే 240 మంది ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. నకిలీ వార్తలను అరికట్టడం, సారాంశ ప్రామాణికత, ప్రజలకు ప్రదర్శించే చిత్రాల సెన్సార్‌షిప్,  ఓటీటీ వేదికలకు స్వీయ నియంత్రణ, పైరసీ తదితర అంశాలపై రెండు గంటలపాటు సాగిన ఈ వెబినార్‌లో పాల్గొన్న ప్రతినిధులు లోతుగా చర్చించారు.

   ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ ఘట్టమనేని ఆది శేషగిరి రావు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ తరఫున శ్రీ కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ప్రసిద్ధ చిత్ర నిర్మాత శ్రీ ఎం.ఎస్.ప్రసాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయ జర్నలిజం ఆచార్యులు, ‘ఈఎంఆర్‌సీ’ డైరెక్టర్ ప్రొఫెసర్ కరణం నరేందర్; పీఐబీ దక్షిణప్రాంత డైరెక్టర్‌ జనరల్‌  శ్రీ ఎస్.వెంకటేశ్వర్‌, పీఐబీ & ఆర్‌ఓబీ డైరెక్టర్‌ శ్రీమతి శ్రుతిపాటిల్ తదితరులు ఈ వెబినార్‌లో పాల్గొన్నారు.
***

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్